బాబు నటనకు నంది అవార్డు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

amarnath-reddy-comments-on-babu
Updated:  2018-04-05 09:21:57

బాబు నటనకు నంది అవార్డు...

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దిల్లీ ప‌ర్య‌ట‌నపై రాష్ట్రంలో ఉన్న ప‌లు రాజ‌కీయ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి పోయిన చంద్ర‌బాబు దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పే నాయ‌కుల్లో క‌నీసం ఒక్క నాయ‌కుడితో కూడా స‌మావేశం కాలేదని ఆరోపిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు గుడివాడ అమర్‌నాథ్ కూడా చంద్ర‌బాబు దిల్లీ ప‌ర్య‌ట‌న పై స్పందించారు.
 
విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్‌నాథ్ నాలుగు సంవ‌త్స‌రాల టీడీపీ పాల‌న‌లో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌ను ఎక్క‌డ ద‌ర్యాప్తుకు ఆదేశిస్తారో అన్న భ‌యంతోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కొత్త డ్రామాలకు తెరలేపారంటూ మండిపడ్డారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఒక్కసారైనా కేంద్రానికి లేఖ రాసిన‌ట్లు కాని, విజ్ఞప్తి చేసినట్లు కాని ఏవైనా సాక్ష్యాలు ఉంటే ప్ర‌జ‌ల‌కు చూపించ‌గ‌ల‌రా అని ఏపీ సీఎంను ప్రశ్నించారు. గతంలో హోదా పేరెత్తితే అదేమైనా సంజీవనా ఏంటి అన్న మాటలు చంద్రబాబు మరిచిపోయారని పేర్కొన్నారు.   
 
ప్ర‌త్యేక‌హోదా కోసం రాష్ట్రంలో ఎక్కడ, ఎవరు పోరాడిన అణచివేయాలంటూ గతంలో చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. హోదా పోరాటానికి విద్యార్థులొస్తే జైలుకు పంపించి, పీడీ యాక్టులు పెట్టండని ఆదేశించింది ఏపీ సర్కార్ కాదా అని ప్రశ్నించారు.  ప్ర‌త్యేక‌హోదా కోసం కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు వస్తే విమానాశ్రయంలోనే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని అడ్డుకున్న ఘటనను రాష్ట్ర ప్రజలు ఎన్నిటికీ మర్చిపోరని తెలిపారు. నాలుగేళ్లుగా ప్ర‌త్యేహోదా కోసం వైసీపీ నిర్విరామంగా పోరాటం కొన‌సాగిస్తుండ‌డాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. 
 
హోదా పోరాటంలో ఈ ఏడాది ఉత్తమ నటుడిగా సీఎం చంద్రబాబుకు నంది అవార్డు కచ్చితంగా ఇస్తారు. గతేడాది బాలయ్యకు ఇచ్చిన అవార్డును ఈ ఏడాది జ్యూరీ సభ్యులు చంద్రబాబుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. కేవలం ఢిల్లీకి వెళ్లి ఫొటోలకు పోజులు ఇచ్చారే తప్ప, హోదా గురించి మాత్రం ఎలాంటి యత్నం చేయలేదన్నారు. గతంలో ఏరోజూ అసెంబ్లీకి మొక్కని చంద్రబాబు.. ఇప్పుడు పార్లమెంట్‌ మెట్లకు మొక్కడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. మా వద్దకు చంద్రబాబుగానీ, టీడీపీ నేతలుగానీ రాలేదని అన్నాడీఎంకే నేత తంబిదురై చెప్పిన విషయాన్ని ఆయ‌న గుర్తు చేశారు. హేమాహేమీలను కలుస్తానంటూ ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, కేవలం హేమమాలినిని కలిసి వ‌చ్చార‌ని ఎద్దెవా చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.