బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పై స‌మ‌గ్ర విశ్లేష‌ణ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-01 02:21:43

బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పై స‌మ‌గ్ర విశ్లేష‌ణ

చంద్ర‌బాబు నాయుడు 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ జీవితాన్ని పుర‌స్క‌రించుకున్న సంద‌ర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాయ‌ల‌సీమ‌కు బీజేపీ ఇచ్చిన డిక్ల‌రేష‌న్ పై మాట్లాడారు...దానిపై జ‌న‌హితం అందిస్తున్న స‌మ‌గ్ర‌ విశ్లేష‌ణ‌.......
 
బీజేపీ  రాయలసీమ ప్రతినిధుల సమావేశం చేసిన సీమ డిక్లరేషన్ నేడు రాజకీయాలలో చర్చకు దారితీస్తోంది. సీమ డిక్లరేషన్ ఇచ్చిన బీజేపీ అంతటితో ఆగకుండా సీమ జిల్లాలో పర్యటన చేయడం మంచిదే. అదే సందర్బంలో TV 9  వారు నిర్వహించిన 40 వసంతాల చంద్రబాబు రాజకీయ ప్రస్దానం కార్యక్రమములో బాబుగారు చేసిన వ్యాఖ్య‌లతో  మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. హోదా పోరాటంలో రాయలసీమ కనీస ప్రస్దావనలేకుండా జరిగిపోతున్న సందర్బంలో ఈ చర్చ మంచిదే.
 
2014 విభ‌జన అనంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాయలసీమకు జరిగిన, జరుగుతున్న వివక్ష పై సీమ ఉద్యమ సంస్దలు, మేధావులు, వ్యక్తులు అనేక రూపాలలో తమ అభిప్రాయాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. జీ వో నెం 120, సిద్దేశ్వరం, గుండ్రేవుల, గుంతకల్లు రైల్వేజోన్, కడప ఉక్కు లాంటి ఉద్యమాలు సైతం రాజకీయపార్టీలతో సంబంధం  లేకుండా సంస్దలు, వ్యక్తులు శక్తికి మించి పోరాటం చేస్తున్నారు.
 
నేడు రాయలసీమ సమస్య‌లను పార్టీలు ప్రస్తావించుతున్నాయి అంటే, అది కచ్చితంగా విభ‌జన తర్వాత సీమ ఉద్యమ సంస్దలు చేస్తున్న కృషి మాత్రమే. అదే సందర్బంలో గమనంలో ఉంచుకోవాల్సింది రాజకీయ పార్టీలు మద్దతు లేదా వారి పోరాటం లేకుండా రాయలసీమ సమస్యలు ప్రజలముందు ఎక్కువ కాలం నిలబడలేవని, పరిష్కారానికి  పరిమితులు ఉంటాయని కూడా సీమ మేధావులు మొదటి నుంచి మాట్లాడుతున్నవిషయం, నేడు BJP సీమ డిక్లరేషన్ చేసిన వెంటనే జరుగుతున్న చర్చ.. అందుకు మంచి ఉదాహ‌ర‌ణ‌. సీమ సమస్యలను పార్టీలు తమ అజెండాలోకి తీసుకుంటే చర్చకు , పరిష్కారానికి దోహదపడుతుంది. అదే సందర్బంలో ఆయా పార్టీలు  స్దానిక నాయకుల వరకే ఆ డిమాండు ఉంటే లాభం కన్నా నష్టం ఎక్కువ.
 
BJP సీమ డిక్లరేషన్ చేసిన వెంటనే అన్ని వర్గాలలో చర్చకు దారితీసింది. అదే సందర్బంలో కేవలం రాయలసీమ నేతల సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి ఆ పార్టీ కేంద్రనాయకత్వం ఆమోదం ఉందా లేదా అన్న అనుమానం నేటికీ కొనసాగుతోంది. BJP సీమ డిక్లరేషన్ ఎంత గొప్పగా ఉన్నా,  ఆ పార్టీ కేంద్రం అంగీకారం ఇంకా ప్రకటించలేదన్న ఒకే ఒక్క కారణంతో ముఖ్యమంత్రి ఒక్క మాటలో వారి నాయకత్వం చెప్పనీయమనండి తర్వాత మాట్లాడుతానని చాలా సులభంగా కొట్టిపారేశారు. ఇరు పార్టీల నిజాయతీ, మంచి చెడ్డల చర్చకన్నా పార్టీ విధానంగా రాయలసీమ సమస్యలు మారకపోతే ఫ‌లితం ఇలానే ఉంటుంది.
 
మరో ముఖ్యమైన అంశం సీమ సమస్యలు మాట్లాడే పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ఆశించినా పరవాలేదు కానీ సమస్యవరకైనా నిజాయితీగా వ్యవహరించాలి. . BJP సీమ సమస్యలను కచ్చితంగానే ప్రస్దావించింది. కానీ విభ‌జన చట్టం వలన తన చేతిలో ఉన్న సీమకు చేయగలిగిన సాయం తాను చేయకుండా రాష్ట్రాన్ని మాత్రం అడిగితే పెద్ద ప్రయోజనం ఉండదు. విభ‌జన చట్టం ప్రకారం సీమకు భుందేల్ ఖండ్ ప్యాకేజీ, గాలేరు నగరి, హంద్రీ నీవాకు నిధులు, కడప ఉక్కు, మన్నవరం పూర్తి, చట్టం ప్రకారం రాష్ట్రానికి రైల్వోజోన్ పరిశీలన‌లో గుంతకల్లును చేర్చడం లాంటివి తన చేతిలోనే ఉన్నా వాటిపై ముందు వెళ్ల‌కపోవడం వలన సీమ సమస్యలపై BJP నిజాయీతీగా చేసిన డిక్లరేషన్ కేవలం చర్చకు మాత్రమే ఉపయోగపడుతుంది...
 
వారి సీమ యాత్ర ముగింపులోగా తమ చేతిలో ఉన్న, చేయాల్సిన అంశాలపై కచ్చితమైన కార్యచరణను BJP ప్రకటించ కుండా సీమ డిక్లరేషన్ తో మాత్రమే ముందుకు వెలితే మాత్రం సీమకే కాదు వారికి కూడా గుర్తింపు ఉండకపోవడమే కాదు, కేవలం కేంద్రం సాయం పై ఆగ్రహంతో ఉన్న వారిని కొంత ప్రాంతంలోనైనా తమపై ఉన్నకోపాన్ని తగ్గించే ఎత్తుగడగ అన్న అపవాదును మూటగట్టుకోకతప్పదు.
 
ఇదే ఛానల్ నిర్వహించిన చర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి BJP పై చేసిన విమర్సలు అంగీకారమైనవే అయినా తాను అందుకు భిన్నంగా ఉన్నారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలి... సీమకు కావాల్సింది నిధులు, నీళ్లు  అవి లేకుండా రాయలసీమకు పరిశ్రమలు రావన్న అభిప్రాయం సరి అయినదే. మరి తాను అలా చేస్తున్నారా లేదే తన 3.5 ఏళ్ల పాలనలో మొత్తం సీమకే ఎక్కువ చేసినాను అంటూ దబాయింపు. 
 
అంత దబాయింపులో కూడా కియో పరిశ్రమ గురించి తప్ప మరో మాట ఉందా..... లేదే. తన పరిపాలనలో అమరావాతి రాజధాని, పోలవరం అది పూర్తి  అయ్యేలోపు వేల కోట్లు పెట్టి పట్టిసీమ, పురుషోత్తపట్నం, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఎయిమ్స్, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇలా చెప్పుకుంటూ పోతే బాబుగారి పాలన అంతా అమరావతి మయం. ఇంత చేసి మొత్తం రాయలసీమకు చేశాను అని మాట్లాడటానికి ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వారికి తగునా. పై పెచ్చు గత 25 ఏళ్ల ఏపీ పాల‌న‌లో  రోశయ్య మిన‌హ అందరూ సీమ వారే... అందులో సగం మీరే.. మరి ఎందుకు ఐక్యరాజ్య సమితి సర్వేలో సీమలో పుట్టే 100 పిల్లలో సగం మంది బలహీనంగా పుడుతున్నారు. హోదా వచ్చింది, రాయలసీమ నేతలకు కానీ పనులు జరిగింది, జరుగుతున్నది  అమరావతికి మాత్రమే... అందుకే BJP సీమ డిక్లరేషన్ అయినా, బాబుగారు చెప్పినట్లు ముఖ్యమంత్రి పదవులు వచ్చినా సీమ సమస్యలు ఆయా పార్టీల రాజకీయ విధానంగా మారినపుడే వాటికి సార్దకం చేకూరుతుంది.
 
పురుషోత్తంరెడ్డి మాకిరెడ్డి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.