బాబు అభ్య‌ర్థుల కోసం వేట అందులో కొన్ని పేర్లు వెలుగులోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-10 17:51:39

బాబు అభ్య‌ర్థుల కోసం వేట అందులో కొన్ని పేర్లు వెలుగులోకి

అధికారంలో ఉన్నా లేకున్నా ఒక్క‌ జిల్లాలో ప్ర‌తీ సారి అభ్య‌ర్థుల‌కోసం అన్వేషించాల్సిందే. ఎంపీ స్థానాల‌కు ఓ నాయ‌కుడంటు లేక‌పోవ‌డంతో ఎప్ప‌టిక‌ప్పుడు వెతుకులాడుతూనే ఉంటారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఇంత‌కు ఆ జిల్లా ఏది అని అనుకుంటున్నారా. అదే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా. ఈ జిల్లాలో ఎంపీ అభ్య‌ర్దులను ఖ‌రారు చేయ‌లేక‌పోతున్నారు. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప్ర‌భావం చూపే స్థాయిలో కొంద‌రి నాయ‌కులు లేక‌పోవ‌డం, ఎన్నిక‌లు త‌ర్వాత సంబంధమే లేన‌ట్లుండే నాయ‌కులకు అవ‌కాశం ఇవ్వ‌డం, ప‌ట్టు పెంచుకునేట‌ప్పుడు టీడీపీ నాయ‌కులు దృష్టిపెట్ట‌క పోవ‌డంతో ప్ర‌తీ సారి ఈ వ్య‌వ‌హారం మొద‌టికొస్తోంది.
 
2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ అధిష్టానం అభ్య‌ర్థుల వేట షురూ చేస్తోంద‌ని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా ప‌రిధిలో మూడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇందులో చిత్తూరు ఎంపీ సీటు ఒక్క‌టే పూర్తి స్థాయి జిల్లా పరిధిలో ఉంది. తిరుప‌తి పార్ట‌మెంట్ ప‌రిధిలో తిరుప‌తి, కాళ‌హ‌స్తి స‌త్య‌వీడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇక రాజంపేట పార్ట‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మ‌ద‌నప‌ల్లి, పుంగ‌నూరు, తంబళ్లపల్లె, పీలేరు నియోజ‌క‌వ‌ర్గ స్థానాలు ఉన్నాయి. 
 
అయితే ఈ మూడు స్థానాల్లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం చిత్తూరు సీటునే గెలుచుకుంది. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కులు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన రెండు సీట్ల‌లోను వైసీపీనే విజ‌యం సాధించింది. చిత్తూరు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి టీడీపీ అభ్య‌ర్థి మార్పు ఖాయం అనే మాట గ‌ట్టిగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ వ్య‌వ‌హార శైలిపై టీడీపీ నాయాక‌త్వం కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉంద‌ని స‌మాచారం. 
 
గ‌తంలో శివ‌ప్ర‌సాద్ బ‌హిరంగంగానే తాను చంద్ర‌బాబు ఓట్ల‌తో గెల‌వలేద‌ని ప్ర‌క‌టించ‌డంతో పార్టీని నివ్వెర‌ప‌రిచింది. దీనికితోడు చంద్ర‌గిరి, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లో శిప్ర‌సాద్ త‌న వ‌ర‌కు సొంతంగా ప్ర‌చారం చేసుకోవ‌డం వ‌ల్లే గ‌ల్లా అరుణ కుమారి, గాలిముద్దుకృష్ణ‌మ నాయుడు ఓట‌మి పాలు అయ్యార‌నే అభిప్రాయం ఉంది. అయితే ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీ శివ‌ప్ర‌సాద్ కు మాత్ర‌మే మెజార్టీ వ‌చ్చింది. ప‌రోక్షంగా ఆయ‌న క్రాస్ ఓటింగ్ కు కార‌ణం అయ్యార‌ని అప్ప‌ట్లో పార్టీ నేత‌లు చంద్ర‌బాబుకు ఫిర్యాదులు కూడా చేశారు. 
 
ఇక మ‌రోవైపు శివ‌ప్ర‌సాద్ త‌న అల్లుడికి స‌త్య‌వీడు లేదంటే క‌డ‌ప జిల్లా రైల్వే కోడురూలో అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్లుగా స‌మాచారం. అయితే అల్లుడు సీటు సంగ‌తి దేవుడు ఎరుగు కానీ చిత్తూరు ఎంపీ స్థానానికి శివ‌ప్ర‌సాద్ కు ఈసారి టికెట్ డౌటే అంటున్నారు. పూత‌ల‌ప‌ట్టు టీడీపీ ఇంచార్జ్ ల‌లిత థామ‌స్,  ఎస్వీయూ వీసీ దామోద‌రం, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సుబ్ర‌మ‌ణ్యం పేర్లను టీడీపీ అధినాయ‌కత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఇక వారితో పాటు క‌ర్నూల్ జిల్లాకు చెందిన ఓ ప్ర‌ముఖ డాక్ట‌ర్ కూడా త‌న‌కు ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారని సమాచారం. అయితే ఈ క్ర‌మంలోనే ఆ డాక్ట‌ర్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసిన‌ట్లు స‌మాచారంఅయితే శివ‌ప్ర‌సాద్ మాత్రం ఎట్టి ప‌రిస్థితిలో త‌న సీటు వ‌దులుకోర‌నే వాద‌న ఉంది. మొత్తం మీద చిత్తూరు పార్ల‌మెంట్ స్థానానికి అభ్య‌ర్థి ఎంపిక ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవారి అభిప్రాయంతో ముడిప‌డి ఉంటుంద‌ని చెబుతున్నారు. 
 
రాజంపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి అభ్య‌ర్థి కోసం టీడీపీ అధినాయ‌క‌త్వం భారీ క‌స‌ర‌త్తు చేస్తోంది. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి అంగ బ‌లం, ఆర్థిక బలం పుష్క‌లంగా ఉండ‌టంతో ఆయ‌న‌కు పోటీగా అభ్య‌ర్థి కోసం టీడీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. రాజంపేట  పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో మైనార్టీలు ఎక్కువ‌, అలాగే మ‌ద‌నప‌ల్లి, పీలేరు, పుంగ‌నూరు, తంబ‌ళ్ల‌ప‌ల్లి, రాయ‌చోటి, రైల్వే కోడూరు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో దాదాపు మూడు ల‌క్షల‌మందికి పైగా మైనార్టీ ఓట్లు ఉంటాయ‌ని అంచ‌నా.. అయితే మైనార్టీల‌ను ఆక‌ట్టుకునేందుకు ఆ వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే షాజ‌హాన్ బాషాను రంగంలోకి దించాలని టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.
 
ఇక పీలేరుకు టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న‌న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, త‌న కుమారుడు అమ‌ర్ నాథ్ రెడ్డిని రాజంపేట పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీకి దించే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇక మ‌రోవైపు సాయి ప్ర‌తాప్, బత్యాల చంగల్రాయుడు కూడా రేసులో ఉన్నారు. అయితే రాజంపేట ఎమ్మెల్యే మేడా ఫ్యామిలీ నుండి మేడా రఘునాథ్ రెడ్డి కూడా పోటీ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు...
 
ఇక తిరుప‌తి పార్ల‌మెంట్ అభ్య‌ర్థి విష‌యంలో ఎటు తేల్చుకోలేక పోతోంది టీడీపీ. నెల్లూరు జిల్లాలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌తో ఉండ‌టంతో అక్క‌డి అభ్య‌ర్ధిని తెర‌పైకి తెస్తార‌నే  ప్రచారం జ‌రుగుతోంది. 2009లో వ‌ర్ల రామ‌య్య  సుమారు 20 వేల ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇక 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. 
 
అయితే చివ‌రి నిమిషంలో బీజేపీ పోలీస్ అధికారి కారుమంచి జ‌య‌రామ్ ని భ‌రిలోకి దించారు. మ‌రో వైపు టీడీపీ ఓట్ల‌ను కూడా బీజేపీ క్యాచ్‌ చేయ‌లేక‌పోయింది. ఇక అదే స‌మ‌యంలో మాజీ ఐఏఏస్ అధికారి వ‌ర‌ప్ర‌సాద్ వైసీపీలో చేరి గ్రామ‌స్థాయిలో, ప‌ట్ట‌న స్థాయిలో పట్టు పెంచుకుని ఎంపీగా విజ‌యం సాధించారు. ఇక బీజేపీ తెగ‌దెంపుల‌తో చాలా మంది నేత‌లు టీడీపీ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.
 
సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే ప‌ర‌సార‌త్నం, వ‌ర్ల‌రామ‌య్యా పేర్లు కూడా టీడీపీ నాయ‌క‌త్వం ప‌రిసీలిస్తోంది. స‌త్య‌వీడు ఎమ్మెల్యే ఆధిత్య కూడా పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌లకు క‌నీసం ఆరు నెలలు ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌నుకుంటున్న టీడీపీ దీనికోసం తీవ్ర స్థాయిలోనే క‌స‌ర‌త్తు చేస్తోంది. 
 
ముఖ్యంగా పార్ల‌మెంట్ స్థానానికి ఎంచుకునే అభ్య‌ర్థి, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల విజ‌యానికి దోహ‌ద‌ప‌డే విధంగా ఉండాల‌ని పార్టీ క‌స‌ర‌త్తు చేస్తోంది. అందుకోస‌మే క్షేత్ర‌స్థాయిలో స‌ర్వేల‌ను నిర్వ‌హించి ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతోంది. చూడాలి మ‌రి చంద్ర‌బాబు ఈ జిల్లాలో ఎలాంటి స్ట్రాట‌జీని ఉప‌యోగిస్తారో.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.