నాయకులూ మారరు..పాలనా తీరు మారదు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 16:14:21

నాయకులూ మారరు..పాలనా తీరు మారదు..

కాలం మారింది... కాలంతో పాటు మ‌న‌మూ మారాలి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీనికి అనుగుణంగానే ప్ర‌జ‌లు కూడా మారారు... మ‌న దేశాన్ని ప‌రిపాలిస్తున్న ప్ర‌భుత్వాలు మారుతూ వ‌స్తున్నాయి. కాని ప‌రిపాల‌నా తీరు మాత్రం మారడం లేదు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. 
 
కాంగ్రెస్ పార్టీకి దాదాపు 130 యేళ్ల చ‌రిత్ర ఉంది. భార‌తదేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ కాలం మ‌న‌ల్ని ప‌రిపాలించింది కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ‌మే. మ‌న దేశ మొట్ట మొద‌ట ప్ర‌ధాన మంత్రి నెహ్రూ నుండి ఇప్పుడు మోదీ వ‌ర‌కు అంద‌రూ దేశాన్ని ఆధునీక‌ర‌ణ‌, పారిశ్రామీక‌ర‌ణ‌, డిజిట‌లైజేష‌న్ అంటూ ...  వీటితోనే దేశాన్ని అభివృద్ది చేయాల‌న్న ఉద్దేశ్యంతో కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేస్తూ కాల‌యాప‌న చేస్తూనే ఉన్నారు. 
 
ఆధునీక‌ర‌ణ, పారిశ్రామీక‌ర‌ణ, డిజిట‌లైజేష‌న్ చేస్తే దేశం అభివౄద్ది చెందిన‌ట్లేనా... అలా అయితే నెహ్రూ కాలం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు అదే చేస్తున్నారుగా ఫ‌లితం ఏంటి...?  మ‌న తాతలు చెప్పుకున్నారు.. భార‌త‌దేశం అభివృద్ది చెందుతున్న దేశం అని, ఇప్పుడు మ‌నం చెప్పుకుంటున్నాం...మ‌న త‌ర్వాత త‌రాలు కూడా అదే చెప్పుకుంటారు. ఇంకెప్పుడు మ‌న దేశ ప్ర‌జ‌లు నా దేశం అభివృద్ది చెందిన దేశం అని చెప్పుకునేది. 
 
129 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకే తెలియ‌రాలేదు మ‌న దేశాన్ని ఎలా అభివౄద్ది చేయాల‌న్నది.. మ‌రి 36 యేళ్ల వ‌య‌స్సు గ‌ల భార‌తీయ జ‌న‌తా పార్టీకి  తెలుస్తుందా...? నిజానికి భార‌త‌దేశంలో అపార‌మైన ఖ‌నిజ సంప‌ద, అట‌వి సంప‌ద‌, నీరు, సార‌వంత‌మైన నేల‌లు, తెలివితేట‌లు గ‌ల ప్ర‌తిభావంతులైన శాస్త్ర‌వేత్త‌లు ఉన్నారు.. 
 
అంత‌కు మించి దేశానికి ప‌ట్టుకొమ్మ‌లైన గ్రామాలు,  ఆ గ్రామాల‌లో క‌ష్ట‌ప‌డి దుక్కి, దున్ని నేల‌ను సాగుచేసి పంట‌ల‌ను పండించే రైతు అనే ఒక విలువైన సంప‌ద మ‌న దేశంలో ఉంది. ఇన్ని సంప‌ద‌లు ఉన్నా కూడా మ‌న దేశ అభివృద్ది కోసం ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డి ముందుకు సాగాల్సి వస్తోంది. కేవ‌లం వ్య‌వ‌సాయ ఆధారిత ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పి మ‌న దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించ‌వ‌చ్చు.. కాని  ప్ర‌భుత్వాలు ఆ దిశ‌గా అడుగులు వేయ‌వు. 
 
అట‌వి సంప‌ద ఉంది..... కాని దాన్ని మ‌నం వాడుకోము... ప‌క్క దేశాల‌కు అక్ర‌మంగా అమ్ముకుంటాము.. బంగారం పండే  సాగు నేల‌లు ఉన్నాయి కాని పండించ‌డానికి రైతన్న‌ల‌కు స‌హ‌కారం అందించ‌దు ప్ర‌భుత్వం.. తెలివితేట‌లు ఉన్న శాస్త్ర‌వేత్త‌లు ఉన్నారు కాని, వారికి చేయుత‌నివ్వ‌క‌పోవ‌డంతో ఇత‌ర దేశాల‌కు వెళ్లి వారి ప్ర‌తిభ‌ను అమ్ముకుంటున్నారు. 
 
మ‌న దేశంలో అనేక న‌దులు ఉన్నాయి... వాటి పై స‌రైన ప్రాంతాల‌లో స‌రైన ప్రాజెక్టులు, ఆన‌క‌ట్ట‌లు, నిర్మించ‌క వ్య‌ర్ధంగా స‌ముద్రంలో నీరు క‌లిపేసుకుంటున్నాము.. నిజానికి స్వాతంత్య్రం అనంత‌రం దేశంలో అన్నీ రాష్ట్రాల‌ను క‌లుపుతూ న‌దులు అనుసంధానం చేసి ఉంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల‌లో తాగు, సాగు నీటి స‌మ‌స్య ఉండేది కాదు.. అప్పుడున్న ప‌రిస్ధితుల కార‌ణంగానో, ఇత‌ర కార‌ణాల చేతనో గ‌త ప్ర‌భుత్వాలు ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేద‌నుకోండి. 
 
ప్ర‌స్తుత పాల‌కుల తీరు..
2014 ఎన్నికల్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి భాజాపా అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పుడున్న ప‌రిస్ధితుల్లో కార‌ణంగానో, గ‌త ప్ర‌భుత్వాల పాల‌న తీరు కార‌ణంగానో మొత్తానికి ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నారు. ఇక బీజేపీ ప్ర‌భుత్వం అధికారాన్ని చేప‌ట్టిన అన‌తి కాలంలోనే స్వ‌చ్చ్ భార‌త్, డిజిట‌ల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీ ప‌థ‌కం, అమృత్ ప‌థ‌కం, ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ఇలా చెప్పుకుంటే పోతే అనేక ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వీటి కోసం కోన్ని వేల కోట్లు కూడా వెచ్చించారు..బాగానే ఉంది. 
 
ఒక ప‌క్క దేశంలో పలు చోట్ల ఇప్ప‌టికీ తాగు, సాగు నీరు అంద‌క పంట‌లు పండించుకోలేక‌, పెట్టుబ‌డుల‌కు డ‌బ్బులు లేక‌, ఒక‌వేళ అప్పు చేసి పంట‌లు పండించినా  గిట్టుబాటు ధ‌ర‌లు లేక ప్ర‌జ‌లు ఆత్మ‌హ‌త్య‌లు, వ‌ల‌స‌లు వంటి ప‌రిస్ధితులు దేశంలో ఏర్ప‌డితే...  
 
ఇప్పుడున్న కేంద్ర‌ప్ర‌భుత్వం, పైన చెప్పిన ప‌థ‌కాల‌న్నీ ప్ర‌వేశ‌పెట్టింది. రైతుల‌కు రుణాలు ఇవ్వ‌డానికి నిధులు లేవు కాని, స్వ‌చ్చ భార‌త్ ప‌థ‌కానికి మాత్రం కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు.రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లేక  ప‌నుల కోసం ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స‌లు పోతుంటే, ప‌ట్ట‌ణాల‌ను స్మార్ట్ సిటీలుగా మార్చ‌డానికి మాత్రం వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తోంది.
 
దేశంలో నిర‌క్ష్యారాస్యుల శాతాన్ని త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం ప‌క్క‌కు పెట్టి, గ్రామాల‌కు డిజిట‌ల్ ఇండియా ప‌థ‌కంతో వైఫై క‌నెక్ష‌న్లు అవ‌స‌ర‌మా...!  మ‌న దేశంలో పండించుకునే ఉల్లిపాయ‌ల‌ను కూడా ప‌క్క దేశాల నుండి కొన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టి దిగుమ‌తి చేసుకుంటున్నాము. ఇదే ఖ‌ర్చు పెట్టి రైతుల‌కు పంట‌లు పండించ‌డంలో మెలుకువ‌లు, ప్ర‌తికూల పరిస్ధితుల‌ను ఎదుర్కొనే అవ‌కాశాలు వెతికి ఉంటే మ‌న‌మే ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేయ‌గ‌లం క‌దా...
 
ప్ర‌భుత్వాలు ఎన్ని మారిన నాయ‌కుల పాల‌నా ధోర‌ణి మాత్రం మార‌లేదు. ప‌ద‌వులు అనుభ‌వించ‌డం కోసం ప‌థ‌కాల పేరుతో కోట్ల‌కు కోట్లు దోచుకోవ‌డం వంటి దురాలోచ‌న‌లే త‌ప్ప‌... ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకుందాము.. దేశాన్ని అభివృద్ది ప‌థంలోకి తీసుకుపోదాం అనే ఉద్దేశ్యం మాత్రం ఇంత వ‌ర‌కూ ఏ ప్ర‌భుత్వానికి రాలేదు.
 
చివ‌ర‌గా..
భార‌తదేశం మాత్రం అభివృద్ది చెందుతూ ఉన్న దేశంగానే  చ‌రిత్ర‌లో మిగిలిపోకుండా......త్వ‌ర‌లోనే  భార‌తదేశం అభివృద్ది చెందిన దేశంగా మారాల‌ని ఆశిస్తూ ముగిస్తున్నాను. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.