నంద్యాల సరే మ‌రి ఈ ఎన్నిక‌లు ఎలా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 12:11:53

నంద్యాల సరే మ‌రి ఈ ఎన్నిక‌లు ఎలా....

క‌ర్నూలు జిల్లా అధికార పార్టీలో రాజ‌కీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. జిల్లాలోని త‌మ్ముళ్ల మ‌ధ్య ఆదిప‌త్య పోరు రోజు రోజుకూ తారా స్ధాయికి చేరుకుంటోంది. రాయ‌ల‌సీమలో పార్టీని మ‌రింత ప‌టిష్టం చేయాల‌నుకుంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి సొంత పార్టీ  నాయ‌కుల నుండే త‌ల‌నొప్పి త‌ప్ప‌డం లేదు. 
 
ముఖ్యంగా క‌ర్నూలు, నంద్యాల, ఆళ్ల‌గ‌డ్డ సెగ్మెంట్ లో  నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు బాబుకు అస్స‌లు మింగుడు ప‌డ‌టం లేదు. మంత్రిగా కొన‌సాగుతున్న అఖిల‌ప్రియపై ఇటీవ‌ల చంద్ర‌బాబు సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే.  అయినా కూడా అఖిల తీరు మార‌లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 
 
ఏవీ సుబ్బా రెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్సీ ఫరుక్ వంటి వారు మంత్రి అఖిల తీరుపై చంద్ర‌బాబు కు ఫిర్యాదు చేశార‌ట‌. నంద్యాల ఉప ఎన్నిక ముందు స‌హ‌క‌రించినా....ఇప్పుడు మాత్రం అఖిల త‌మ‌కు స‌హ‌కరించ‌డం లేద‌ని వారు బాబు ఎదుట వాపోయిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డికి, ఎంపీ టీజీ వెంక‌టేష్ కుమారుడు భ‌ర‌త్ మ‌ధ్య ఎమ్మెల్యే టికెట్టు వివాదం కొన‌సాగుతూనే ఉంది. .
 
క‌ర్నూలు పుర‌పాల‌క సంస్ధ ఎన్నిక‌లపై స‌మీక్ష నిర్వ‌హించేందుకు జిల్లా నేత‌ల‌తో చంద్ర‌బాబు ఇటీవ‌ల స‌మావేశం అయ్యారు.  జిల్లాలో నేతల మధ్య సమన్వయం సాధించేందుకు కేఈ కృష్ణమూర్తి సారధ్యంలో కమిటీ కూడా వేశారు. విభేదాలు వ‌దిలి జిల్లాలో పార్టీని ప‌టిష్టం చేసే దిశ‌గా ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు నేత‌ల‌ను హెచ్చ‌రించిన‌ట్లు తెలిసింది.  
 
ఇప్పుడున్న పరిస్ధితుల్లో పుర‌పాల‌క ఎన్నిక‌ల‌కు వెళ్తే  అధికార పార్టీకి చేదు అనుభ‌వం త‌ప్ప‌ద‌ని స‌మాచారం.  నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో  అధికారాన్ని అడ్డం పెట్టుకోవ‌డంతో పాటు ప్ర‌లోభాల ప‌ర్వానికి తెర‌లేపి గెలిచిన టీడీపీ... క‌ర్నూలు పుర‌పాల‌క ఎన్నిక‌ల కోసం ఏ విధంగా వ్యూహాలు ర‌చిస్తుందో చూడాలి మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.