చంద్ర‌బాబు హైదరాబాద్ నిర్మించ‌లేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 15:14:44

చంద్ర‌బాబు హైదరాబాద్ నిర్మించ‌లేదు

ఏపీ మ‌ఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న విధానం పై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అభివృద్దిని కేవ‌లం హైద‌రాబాద్‌కు ప‌రిమితం చేయ‌డం వ‌ల్లనే 2014 రాష్ట్ర విభ‌జ‌న‌తో కొత్త‌గా ఏర్ప‌డిన సీమాంధ్ర ప్ర‌దేశ్‌కు రెవెన్యూ లోటు ఏర్ప‌డింద‌ని అన్నారు. 
 
విజయవాడలో ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి పుస్తకావిష్కరణ త‌ర్వాత‌ పవన్‌ ప్రసంగించారు. రాజధాని, అభివృద్ది విషయంలో గతంలో చేసిన తప్పునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునరావృతం చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.  ఏపీ ప్రభుత్వ విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
ఆర్థిక‌ప‌ర‌మైన అంశాల‌కు రాజ‌కీయాలు బానిస అయితే అది ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని అన్నారు. పాలకులు అభివృద్ధి చెందాల‌నే అనే బాధ్యతతో పని చేయాలని అన్నారు. మానవత దృక్పధంతో ఆలోచ‌న చేసి ప్రజా దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ది కేంద్రీకృత నిర్ణయాలే రాష్ట్రాల‌ విభజనకు కారణం అయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌ను నిర్మించింది నేనే అని చంద్ర‌బాబు చెప్పుకుంటున్న దానిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖండించారు. చంద్ర‌బాబు నిర్మించింది కేవ‌లం సైబ‌రాబాద్‌ను మాత్ర‌మే అని ఆయ‌న తెలిపారు.
 
హైద‌రాబాద్ ఔటర్‌ రింగ్‌రోడ్‌తో ఎంత అభివృద్ధి జరిగిందో అంతే విధ్వంసం కూడా జ‌రిగింద‌ని ప‌వ‌న్ తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్ కోసం అతి త‌క్కువ ధ‌ర‌కు భూములిచ్చిన చిన్న రైతులు వారి కళ్ల ముందే వాటి విలువ కోట్ల రూపాయాల్లోకి చేరిందని అన్నారు. అక్క‌డ జ‌రిగిన‌ అభివృద్ధిలో తాము భాగస్వామ్యం కాలేదన్న భావన అక్కడి ప్రజల్లో పెరిగిపోయిందని అన్నారు..... అందువ‌ల్ల‌నే ఆంధ్రా వాళ్లపై రైతులకు కోపం వచ్చింద‌ని తెలిపారు. 
 
ఏపీలో కోత్త‌గా నిర్మిస్తున్న అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలోను అదే విధానం కోన‌సాగుతోంద‌ని అన్నారు.  అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే మళ్లీ ఉద్యమాలు చెలరేగే అవకాశం ఉందని అన్నారు. ఇప్ప‌టికే రాయలసీమ ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్న ప్ర‌జ‌లు ఉద్య‌మాలు చేస్తున్నార‌ని తెలిపారు. సింగపూర్‌ తరహా రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఐదు, పది సంవత్సరాల్లో నిర్మిస్తామని చెబుతున్నారు. కానీ, నేను మళ్లీ చెబుతున్నా రాత్రికి రాత్రి మహానగరాలను నిర్మించలేరన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలి అని పవన్‌ అన్నారు. ఇక రాజధాని నిర్మాణం కూడా ప్రత్యేక హోదా లాంటి బలమైన అంశమేనన్న అభిప్రాయాన్ని పవన్‌ వ్యక్తం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.