అక్కడ చుక్కలు చూపిస్తున్న పవన్..టీడీపీ సర్దుకోవాల్సిందే..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan and tdp
Updated:  2018-10-22 01:04:05

అక్కడ చుక్కలు చూపిస్తున్న పవన్..టీడీపీ సర్దుకోవాల్సిందే..

ఏకులా వచ్చి మేకయ్యాడన్న సామెతను నిజం చేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌. 2014 ఎన్నికలకు ముందు.. పార్టీ పెట్టిన ఆయన అప్పటి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. ఇప్పుడు మాత్రం విజృంభిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన విశాఖజిల్లాలో అటు అధికార పక్షం టీడీపీకి చుక్కలు చూపిస్తున్నాడు.  ఇంతకీ టీడీపీ కి పవన్ విసురుతున్న అస్త్రం ఏంటి.. చూద్దాం.. 
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నేత లైన కొణతాల రామకృష్ణ వంటివారికి గేలం విసిరారని, వారంతా జనసేనతో జట్టుకట్టేందుకు రెడీ అయ్యారని అంటున్నా రు. నిజానికి కొణతాల టీడీపీలోకి వస్తే.. ఆయనకు అనకాపల్లి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇది జరుగుతుండగానే ఇటీవల జనసేన నిర్వహించిన కవాతు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొణతాల రామకృష్ణ.. పవన్ చెంతకు చేరేందుకు రెడీ అయ్యారనే వార్తలు వచ్చాయి. 
 
ఇదిలావుంటే, ఇప్పుడు మళ్లీ.. మరికొందరు కూడా జనసేనలోకి జంప్ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ నేతలు, ఇతర ముఖ్య నేతలు పవన్ వైపే మొగ్గు చూపడం టీడీపీ కి షాక్ ఇచ్చే అంశమే.. మరి ఆ నేతలెవరూ.. 
 
తెలుగుదేశం పార్టీ తరపున ఎలమంచిలి నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమైన సుందరపు విజయకుమార్‌ జనసేన పార్టీలోకి వెళ్లారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి దగ్గరగా వుంటున్న పవన్‌కల్యాణ్‌ సిద్ధాంతాలు నచ్చాయని, ఆయనలా ప్రజలకు అండగా వుండేందుకు జనసేనలో చేరానని పేర్కొన్నారు.
 
అలాగే మునగపాక తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత జెడ్‌పీటీసీ సభ్యుడు దాడి లక్ష్మీసత్యనారాయణ సతీమణి హెన్నా కూడా జనసేన పార్టీలో చేరారు. గోపాలపట్నానికి చెందిన బిల్డర్‌ విల్లా శ్రీనివాసరావు గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. ఇప్పుడు జనసేనలో చేరారు. గాజువాక(మింది)కి చెందిన ఈటి రంగారావు, పాయకరావుపేటకు చెందిన శివదత్‌, యంగ్‌ ఇండియా ట్రస్టు ప్రతినిధి పి.వెంకట సురేశ్‌, విశాఖకు చెందిన న్యాయవాది చంద్రమౌళి తదితరులు పార్టీలో చేరారు ..
 
ఈ పరిణామాలతో టీడీపీ తీవ్రస్థాయిలో తర్జన భర్జన పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏం జరగుతుందో చూడాలి.

షేర్ :

Comments

0 Comment