టీడీపీ నయా ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 11:38:05

టీడీపీ నయా ప్లాన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ ప్లీనరిలో జగనే స్వయంగా ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. పీకే టీం కోసం హైదరాబాద్ లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.

పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహాలు రచిస్తూ... వాటిని సరైన సమయంలో...... సరైన రీతిలో...... అమలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం వైయస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను కూడా పీకే టీం దగ్గరుండి మరీ చూసుకుంటోంది.

పాదయాత్ర లో జగన్ స్పీచ్ రెడీ చేయడం... ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఏ విధంగా ఎండగట్టాలి.... నవరత్నాలను ప్రజలకు ఏ రకంగా వివరించాలి అన్న సలహాలు ఇవ్వడంతో పాటు జగన్ పాదయాత్రపై ప్రజలు ఏమనుకుంటున్నారు వంటి అనేక విషయాలపై పీకే టీం ఓ నివేదికను కూడా తయారు చేస్తోంది.

అడుగడుగునా జగన్ పాదయాత్ర చిత్రాలను కూడా పీకే టీం కేమెరాలతో చిత్రీకరిస్తోంది. వీటిని ఎన్నికల ముందు ఉపయోగించనున్నారు. దీంతో పాటు పార్టీ అభ్యర్ధుల ఎన్నిక విషయంలో కూడా పీకే టీం పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పీకే టీం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు వైసీపీని ఎదుర్కొనేందు అధికార తెలుగుదేశం పార్టీ కూడా ఇదే బాట పట్టింది.

ప్రచారానికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన గ్రూప్ ఎం అనే సంస్థను తెలుగు దేశం పార్టీ నియమించుకుంది. గ్రూప్ ఎం నేరుగా కాకుండా వేర్వేరు ఏజెన్సీల ద్వారా ప్రచారం, ప్రజా సంబంధాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో సమాచార శాఖతోపాటు ఆయా సంస్థలు కూడా నేరుగా పాల్గొంటున్నాయి. ఈ ప్రచార సంస్థను నేరుగా సిఎం కార్యాలయం పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. గ్రూప్ ఎంకి టీడీపీ బాధ్యతలు అప్పగించడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి.

సమాచార శాఖకు సంబంధించిన అధికారులు గ్రూప్ ఎం సంస్ద పట్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పార్టీ వ్యక్తిగత కార్యక్రమాలకు ప్రజా ధనాన్ని టీడీపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రూప్ ఎం కోసం టీడీపీ కూడా భారీ ఎత్తున ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుండే రంగంలోకి దిగి అధికార, ప్రతిపక్షాలు సిద్దం చేసుకున్న ఈ అస్త్రాలు ఎంతవరకు ఫలితాలను అందిస్తాయో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.