జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నాడు కలవడం జరిగింది. సుమారు గంటకు పైగా జరిగిన భేటీ అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుందనే గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చానని, ఈ రెండు పార్టీలు చెబుతున్న మాటలు పరస్పరం విరుద్దంగా ఉన్నాయని పవన్ మండిపడ్డారు. పోలవరంపై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉందని పవన్ ప్రశ్నించారు. ఈ నెల 15 లోగా కేంద్రం నుండి వచ్చిన నిధుల వివరాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిధుల వివరాలు ఇస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఎవరు అబద్దాలు చెబుతున్నారో ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. జేఏసీలో భాగంగా ఎవరెవరు పని చేయనున్నారనే జాబితా త్వరలో చెబుతానని పవన్ పేర్కొన్నారు.
పవన్ అనంతరం ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ...పవన్ నాతో రాజకీయాలు మాట్లాడలేదు. టీడీపీ-బీజేపీలో ఎవరు అబద్దాలు ఆడుతున్నారంటూ నన్ను అడిగారని తెలిపారు. పవన్ ప్రయత్నానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఉండవల్లి పేర్కొన్నారు.
పవన్ అసలైన రాజకీయలు ఇప్పుడు మొదలుపెట్టారని, గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు గానూ ఇప్పుడు ప్రశ్నించడకుండా, ప్రజలకు సమాధానం చెబుతున్నారని అన్నారు. నాకు రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండటం ఇష్టం లేదు....ప్రజలకోసం పవన్ చేస్తున్న ప్రయత్నానికి మాత్రం తప్పకుండా తనకు అప్పగించే బాధ్యతను నిర్వహిస్తానని ఉండవల్లి తెలిపారు.
Comments