వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పై తనదైన శైలిలో విమర్శలు చేశారు... ఒక వైపు వైసీపీ నేతలు,మరో వైపు రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కావాలని ఆకాంక్షిస్తుంటే టీడీపీ నాయకులు మాత్రం చీమ కుట్టినట్లు వ్యవహరిస్తోన్నారని రోజా మండిపడ్డారు.
గత నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తున్నారని అన్నారు... ఈ రోజు ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని, వారితో పాటు టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు రోజా.
టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు పార్టీ ద్రోహుల పార్టీ గా మారబోతుందని రోజా అన్నారు... ప్రత్యే హోదాకోసం తమ పార్టీ నాయకులు నిరంతరం కృషి చేస్తున్నతీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ది చెబుతారని అన్నారు.
రాష్ట్ర అభివృద్ది లక్ష్యంగా చేసుకుని తమ పార్టీ ఎంపీలు వారి పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్షకు సిద్దమయ్యారని రోజా అన్నారు... కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు...పార్లమెంటు సాక్షిగా హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం నమ్మించి మోసం చేసిందని వాపోయారు.
అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఏదో పొడిచేస్తానని ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని అన్నారు... ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వచ్చినా టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయరా? అని నిలదీశారు రోజా.
Comments