అన్న‌దాత ఆత్మ‌హ‌త్యలే అస‌లు కారణం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

farmers image
Updated:  2018-03-09 05:04:05

అన్న‌దాత ఆత్మ‌హ‌త్యలే అస‌లు కారణం

ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ది పాత సామెత‌ "  ప‌రిష్క‌రించ‌లేని స‌మ‌స్యను ప్ర‌తిప‌క్షాల మీదకు నెట్ట‌డ‌మో, ప‌క్క‌దారి ప‌ట్టించ‌డ‌మో చేయాల‌న్న‌ది నేటి రాజ‌కీయ నాయ‌కులు క‌నుగొన్న కొత్త సామెత‌.  ఈ విష‌యంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల చంద్రులు ఒక‌రికొక‌రు తీసిపోరు. మరీ ముఖ్యంగా చంద్ర‌బాబుది ఈ విష‌యంలో అగ్ర‌స్థానం. తాజాగా  ఆ స్థానంలోకి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.
 
తాజాగా ఆయ‌న నోటి నుండి వెలువ‌డిన థ‌ర్డ్ ఫ్రంట్ మాట‌లు, కేంద్రంపై మాట‌ల దాడి ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. ఆయ‌న ఈ స్థాయిలో రెచ్చిపోవ‌డానికి కార‌ణం.. ప్ర‌ధానిని తూల‌నాడిన మాట‌ల‌ను త‌ప్పించుకోవ‌డానికే అని చాలా మంది భావిస్తున్న‌ప్ప‌టికీ అస‌లు విష‌యం వేరే ఉందంటున్నారు విశ్లేష‌కులు. తెలంగాణ‌లో అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌ల పాపాన్ని కేంద్రం మీద నెట్టేయ‌డానికే కేసీఆర్ ఈ కొత్త‌ పంథా ఎంచుకున్నార‌ని చెబుతున్నారు.  దీనికి తాజాగా సాక్షి దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ వార్త‌ను వారు ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు.
telangana 
 
ఆ వార్త ఏంటంటే..: 
తెలంగాణ ఏర్ప‌డి, టీఆర్ఎస్ అధికారం చేప‌ట్టిన ఈ మూడేళ్ల‌లో దాదాపు 1,149 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అధికారులు నిర్ధారించార‌ని, అందులో  846 మందికి ప‌రిహారం చెల్లించార‌నేది ఆ వార్త సారాంశం. వాస్త‌వానికి గ‌తేడాది ఆగ‌స్టు 31 నాటికి 2066 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని, అయితే అధికారుల‌ విచార‌ణ‌లో 1,149 మందే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డార‌ని జిల్లాల వారీ లెక్క‌లు సైతం ఇచ్చింది. మ‌రోవైపు ఈ వివ‌రాల‌కు తోడు రైతు స్వ‌రాజ్య‌వేదిక నివేదిక‌లో దాదాపు 3,500 మంది అన్న‌దాత‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలిందంటూ సామాజిక మాధ్య‌మాల్లో వివ‌రాల‌తో స‌హా వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. 
 
దీంతో ఈ విష‌యం ప్ర‌భుత్వానికి ఇబ్బంది కరంగా మారే ప‌రిస్థితులు క‌నిపించ‌డంతో దిద్దుబాటుకు కేసీఆరే స్వ‌యంగా రంగంలోకి దిగార‌ని అంటున్నారు. వాస్త‌వానికి తెలంగాణ‌లో రైతుల‌కు ఎరువులు ఉచితం, 24 గంట‌ల క‌రెంటు అందుబాటులోకి, నీళ్లు స‌మృద్ధిగా అందేలా మిష‌న్ కాక‌తీయ లాంటి ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. దిగుబ‌డికి కేంద్రం స‌రైన మద్ద‌తు ధ‌ర ఇవ్వ‌క‌పోవ‌డంతోనే రైత‌న్న‌లు ఆత్మ‌హ‌త్య‌ల బాట ప‌డుతున్నార‌ని కేసీఆర్ త‌న స‌న్నిహితుల‌తో అన్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేంద్రంపై విరుచుకుప‌డ్డార‌ని కొందరు అంటుంటే, మ‌రికొంద‌రేమో వేరే వాద‌న వినిపిస్తున్నారు.  తెలంగాణ వ‌స్తే అన్న‌దాత ఆత్మ‌హ‌త్య‌లు ఉండ‌వు అని ఉద్య‌మ స‌మ‌యంలో చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వ‌చ్చాక ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గ‌డానికి ఏమీ చేయ‌లేక పోయార‌ని అందుకే ఆ నెపం కేంద్రం మీద‌కు నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న వ్య‌తిరేకులు మండిప‌డుతున్నారు. 
 
ఒక్క దెబ్బ‌కు ఎన్నిపిట్ట‌లో...: 
అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌ల్ని దారి మ‌ళ్లించ‌డానికి అన్నారో లేక కేంద్రం నుంచి స‌రైన స‌హ‌కారం లేక‌పోడమే కార‌ణ‌మ‌ని చెప్ప‌ద‌లచుకున్నారో కానీ... కేసీఆర్ అన్న మాట‌లు జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది మాత్రం వాస్త‌వం. ఏదేమైనా కేంద్రంపై కేసీఆర్ వ్యాఖ్యలు కొంద‌రికి  (మ‌రీ ముఖ్యంగా టీడీపీకి, టీడీపీ వీరాభిమానుల‌కు)  సంతోషం క‌లిగిస్తే, మ‌రికొంద‌రికి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అందులో ప్రస్తావించాల్సిన‌వి ఇవీ.. 
 
1.తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌స్సు యాత్రల నుంచి దృష్టి మ‌ళ్లించ‌డం.
2. అన్న‌దాత ఆత్మ‌హ‌త్య‌ల నుంచి ప్ర‌తిప‌క్షాలు ల‌బ్ధి పొంద‌కుండా చూడడం.
3. దేశ‌వ్యాప్తంగా బీజేపీకి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ తెలంగాణ‌లోనూ క‌నిపించ‌కుండా చూడ‌డం.
4. కేంద్రం త‌న‌పై, త‌న గ‌వ‌ర్న‌మెంట్ పై క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌కుండా నిల‌వ‌రించ‌డం.
 
అయితే కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు ప్ర‌త్య‌క్షంగా కామెంట్లు చేయ‌క‌పోవ‌డాన్ని చూస్తే, ఈ వ్యాఖ్య‌ల వ‌ల్ల త‌న‌కేదైనా న‌ష్టం క‌లుగుతుందేమో అని భావిస్తున్న‌ట్లు అనుకోవాలి. కార‌ణం.. కేసీఆర్ అన్నారు క‌దా అని తానూ కేంద్రాన్ని ఏదైనా అంటే ఏమ‌వుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే ఆంధ్ర‌ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వ‌క‌పోయినా ఇప్ప‌టికీ గ‌ట్టిగా నిలదీయ‌లేక‌పోవ‌డం ఈ కోవ‌లోకి వ‌చ్చేదే.  ఈ విష‌యంలో ఆయ‌న‌కు అనుకూల మీడియా నుంచి ఏదైనా స‌మాచారం అందిన‌ట్లే ఉంది. అందుకే కేసీఆర్ వ్యాఖ్య‌ల‌తో తాను ఇరుకున ప‌డ్డాన‌ని బాబుకు అనిపించిన‌ప్ప‌టికీ మౌనంగా ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అంటున్నారు.
farmers
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.