100సీట్ల‌లో గెలిచి చూపిస్తా..

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana cm kcr
Updated:  2018-08-25 02:10:47

100సీట్ల‌లో గెలిచి చూపిస్తా..

సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. రాజ‌కీయ క‌ద‌న‌రంగంలో కాలుదువ్వుతు ప్ర‌త్య‌ర్ధి ఎత్తుల్ని చిత్తు చేసేలా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు.  గ‌త వారం నుంచి ముంద‌స్తు ఎన్నిక‌లంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక‌రేపిన కేసీఆర్..సెప్టెంబరు 2న జరిగే ప్రగతి నివేదన సభలో త‌న ఉనికిని చాటుకునేందుకు అస్త్రాల‌న్నీ సిద్ధంచేస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగితే అధికార పార్టీకి ఏం జ‌రుగుతుందో తెలిసీ కూడా ఎందుకు ఇలాంటి సాహ‌సం చేస్తున్నారు. ముందస్తు ఎన్నిక‌లైతే గెలుస్తాం..లేదంటే ప్ర‌త్య‌ర్ధుల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లవుతుంద‌ని భావించారా..?  లేదంటే ఏపీ సీఎం చంద్ర‌బాబు వేసే ఎత్తుకు బ‌ల‌వ్వ‌డం ఇష్టం లేక‌నా..? అంటే..అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది.
  
దేశం మొత్తం 2019 ఎన్నిక‌ల కోసం ఎదురు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం తీరు విచిత్రంగా ఉంది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ - టీడీపీ పొత్తంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల్ని నిజం చేసేలా ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ తెలంగాణాలో రెండురోజుల మకాం వేశారు. స‌భపేరుతో హైద‌రాబాద్ లో వాలిన యువ‌రాజు రాజ‌కీయ భవిష్య‌త్తు పై పార్టీ నేత‌ల‌తో సుదీర్ఘ మంత‌నాలు జ‌రిపారు.
 
ఆ మంత‌నాలే తెలంగాణ లో కాంగ్రెస్ - టీడీపీ పొత్తుకు బీజం వేశాయి. అంతే దీంతో అలెర్ట్ అయిన సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలంటూ హిత‌బోధ చేశారు. ఎన్నిక‌లు ఎప్పుడ‌నేది నాకు వ‌దిలేయండి. 100స్థానాల్లో గెలిచి చూపిద్దాం అంటూ నేత‌ల‌కు నూరి పోశారు. అయితే దీనంత‌టికి ఏపీ సీఎం చంద్ర‌బాబేన‌ని రాజ‌నీతిజ్ఞులు చెబుతున్న మాట‌. 
 
తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌లు లేనిప‌క్షంలో పోల్ మేనేజ్ మెంట్ లో చాణుక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించే  చంద్ర‌బాబును త‌ట్టుకోవ‌డం చాలాక‌ష్టమ‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుంది. అందుకే  అధికారం చేప‌ట్టిన త‌రువాత ప్ర‌భుత్వం అందించిన సంక్షేమ ప‌థ‌కాలపై ప్ర‌జ‌లు సుముఖంగా లేక‌పోవ‌డంతో దీన్ని చ‌ల్లార్చేందుకే  రైతుల‌కు ముంద‌స్తు సొమ్ములు, కంటివెలుగు, కేసీఆర్‌కిట్ల‌తో హ‌ల్‌చ‌ల్‌చేశారు. జ‌నంలో టీఆర్ఎస్ పేరు న‌లుగుతున్న స‌మ‌యంలోనే ఎన్నిక‌ల‌కు పోతే.. గెలుస్తామ‌నే ధీమాకు చేరారు. 
 
అందుకే టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశంలో ఎన్నిక‌లపై మాట్లాడిన కేసీఆర్ మ‌రోమారు వ‌రాల‌జ‌ల్లు కురిపించారు. ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ , సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్చకులకు నేరుగా వేతనాలు. పూజారుల పదవీ విరమణ పరిమితి 58 నుంచి 65కు పెంచ‌డం, ఇమామ్, మౌసంలకు నెలకు రూ.5వేల భృతి,  29 మినీ గురుకులాల ఉద్యోగులకు వేతనాలు పెంపు. హెచ్ఎం, వార్డెన్‌కు రూ.5వేల నుంచి రూ.21 వేల వరకు పెంపు.
 
సీఆర్టీలకు రూ.4వేల నుంచి రూ.15 వేల వరకు పెంపు. పీఈటీలకు రూ.4వేల నుంచి రూ.11వేల వరకు పెంపు. అకౌంటెంట్‌కు రూ.3500 నుంచి రూ.10వేల వరకు పెంపు. ఏఎన్ఎంలకు రూ.4వేల నుంచి రూ.9వేల వరకు పెంపు. వంటమనిషి, ఆయా, హెల్పర్, స్వీపర్, వాచ్‌మెన్‌లకు రూ.2500 నుంచి రూ.7500 వరకు పెంపుతో  పేరుతో ఓట‌ర్ల‌ను త‌న‌వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు.
 
 
దీంతో పాటు అభ్య‌ర్ధుల జాబితా, నియోజ‌క‌వర్గాల ప‌ర్య‌ట‌న‌పై  క్లారిటీ ఇచ్చారు. ఈ మొత్తంగా చూసుకుంటే ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో మ‌రోమారు తెలంగాణ‌లో కారుజోరును పెంచేందుకు సిద్ధ‌మయ్యారు సీఎం కేసీఆర్. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.