బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

ktr targeted bjp
Updated:  2018-03-29 06:02:07

బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్‌

తెలంగాణ  అసెంబ్లీలో ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లును ప్ర‌వేశ‌పెడుతోంది అధికార టీఆర్‌య‌స్ పార్టీ. ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తోంది. దీని వ‌ల్ల ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాలు క‌నుమ‌రుగ‌వుతాయ‌ని, అంతేకాకుండా బ‌డుగు బ‌లిహీన వ‌ర్గాల విద్యార్థుల‌కు విద్య అంద‌ని ద్రాక్ష‌గా మిగులుతుంద‌ని బీజేపీ నాయ‌కులు అంటున్నారు. దీనికి స్పందించిన మంత్రి కె.తారక రామారావు బీజేపీ రాష్ట్రానికో  విధానాన్ని వ్యవహరిస్తోందని అన్నారు.  
 
అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడిన ఆయ‌న‌ మొన్నటిదాకా బీజేపీ మంత్రులున్న ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు ఎందుకు ఆమోదం తెలిపార‌ని ప్ర‌శ్నించారు. అందులో క‌నీసం స్థానికులకు రిజర్వేషన్లు లేకుండానే బిల్లు తీర్మానించార‌ని అన్నారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో స్థానికులకు 25 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది కేవ‌లం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.
 
బీజేపీ ప‌రిపాల‌న చేసే 21 రాష్ట్రాల్లో ప్రైవేటు యూనివర్సిటీలు లేవా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికో వైఖరిని అమ‌లు చేస్తే అది పెద్ద త‌ర‌హా ప్రాంతీయ‌ పార్టీ అవుతుందే త‌ప్ప జాతీయ పార్టీ కాద‌ని అన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడాన్ని ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లుకు ముడి పెట్టడం హాస్యాస్పదం అని అన్నారు.
 
ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడటం లేద‌ని, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ల కోసమే టీఆర్‌ఎస్‌ పోరాడుతుంద‌ని అన్నారు. ఇది తెలుసుకోకుండా, అవగాహన లేకుండా రాష్ట్ర బీజేపీ మాట్లాడుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు వస్తే ఉన్నత ప్రమాణాలున్న విద్యే కాకుండా ఉపాధి అవకాశాలూ మెరుగుపడతాయని కేటీఆర్ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.